నారాయణ్​పూర్​ జిల్లాలో ఎన్​కౌంటర్ లో​ఇద్దరు మావోయిస్టులు మృతి

నారాయణ్​పూర్​ జిల్లాలో ఎన్​కౌంటర్ లో​ఇద్దరు మావోయిస్టులు మృతి

భద్రాచలం, వెలుగు: ఛత్తీస్​గఢ్​ రాష్ట్రంలోని నారాయణ్​పూర్​ జిల్లాలో బుధవారం జరిగిన ఎన్​కౌంటర్​లో ఇద్దరు మావోయిస్టులు హతమయ్యారు. నారాయణ్​పూర్, కొండగావ్​ బార్డర్​లో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఐజీ సుందర్​రాజ్​ పి నేతృత్వంలో బలగాలు మంగళవారం సాయంత్రం కూంబింగ్​ చేపట్టాయి. కిలం-బర్గూం అటవీ ప్రాంతంలో డీఆర్జీ, బస్తర్​ ఫైటర్స్ కు మావోయిస్టులు తారసపడ్డారు. పోలీస్​బలగాలపై కాల్పుల జరుపుతూ మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.

అనంతరం భద్రతా దళాలు ఘటనా స్థలంలో ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను గుర్తించారు. డిస్ట్రిక్ట్  కమిటీ సభ్యుడు, ఆమ్దాయి ఏరియా కమిటీ కమాండర్​ హల్దర్ కశ్యప్, ఆమ్దాయి ఏరియా కమిటీ మెంబర్​ రామే సోరీ అలియాస్​ రాములుగా వారిని గుర్తించారు. హల్దర్​పై రూ.8లక్షలు, రామేపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు ఐజీ తెలిపారు. ఏకె-47, ఆటోమెటిక్​ వెపన్, విప్లవ సాహిత్యం, మావోయిస్టు పార్టీ డాక్యుమెంట్లు, ఇతర పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్​గఢ్​లో ఈ ఏడాది 148 మంది మావోయిస్టులు ఎన్​కౌంటర్లలో చనిపోయారు.